
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ వద్ద పెద్ద చెరువులో నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చి వేశారు. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో వెలసిన విల్లాల అనుమతులు రద్దు చేసినా నిర్మాణాలు కొనసాగడంపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో వున్నాయని గతంలో కొన్నిటిని కూల్చినట్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు వివరించారు. మున్సిపాలిటీ, ఇరిగేషన్ విభాగాలు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగడంపై రంగనాథ్ సీరియస్ అయ్యారు. రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వుండడంతో.. కోర్టుకు సమాచారం యిచ్చి కూల్చివేత పనులను చేపట్టారు.